Thursday, August 6, 2015

కందిపొడి ( red gram powder)

 వేడి,వేడి అన్నంలో కందిపొడి,పప్పునూనె ఒక స్పూను వేసుకొని కలుపుకు తింటే ! ఆహా ఏమి రుచి . కందిపొడి నేను చేసే విధానం  ... ఇలా...

కావలసినవి:

కందిపప్పు - ఒక గ్లాసు

శనగపప్పు - అర గ్లాసు

మినప్పప్పు - పావు గ్లాసు


పెసరపప్పు - అర గ్లాసు

జీలకర్ర - రెండు స్పూన్లు

ఉప్పు  -  ఒక స్పూను

కారం -- ఒకటిన్నర స్పూను

పసుపు -  పావు స్పూను

వెల్లుల్లి - ఒక పాయలో 5 రెబ్బలు

 చేసే విధానం:

ముందుగా నాలుగు పప్పులూ విడి,విడిగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి.తరువాత జీలకర్ర కూడా వేయించాలి. కొద్దిగా చల్లారనిచ్చి, అన్నిపప్పులూ,జీలకర్రా,ఉప్పు,పసుపు,కారం,కావలసినవారు వెల్లుల్లి పచ్చివి వేసి కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.  ఘాటు పోకుండా సీసాలో వేసి మూతపెట్టాలి.

Monday, August 3, 2015

పులిహోర (pulihora)

పులి హోర ఇంట్లో ప్రతి రెండు రోజులకొకసారి చేసి బాబాగారికి నైవేద్యం పెట్టి అందరికీ ఫలహారంగా ఇస్తాము. తెలిసిన వంటకం అయినా నేను చేసే రుచి ఎలా ఉంటుందో చూద్దామా!

కావలసినవి: అరకేజీ పులి హోరకి...

వేరుశనగ గుళ్ళు - 3 చెంచాలు

శనగపప్పు    -  2 చెంచాలు

మినప్పప్పు     - 2 చెంచాలు

ఆవాలు   -- 1 చెంచా

ఇంగువ  - సరిపడా

ఎండుమిర్చి  - 6

పచ్చిమిర్చి  - 8

కరివేపాకు - గుప్పెడు ఆకులు

 చింతపండు - 50 గ్రాములు(ఒకచిన్నగ్లాసు నీళ్ళు పోసి నానబెట్టాలి.)

బియ్యం - అరకేజీ (అన్నం వండాలి.)

 పసుపు - అర స్పూను

 ఉప్పు - రెండు స్పూన్లు

నూనె -- 4 టేబుల్ స్పూన్లు,మరియు నెయ్యి ఒక టేబుల్ స్పూను

 ఆవ పెట్టి చేస్టే ఇంకా బాగుంటుంది. ఆవపెట్టాలంటే...

ఆవపిండి - ఒక స్పూను, అరచెంచా కారం, పావుచెంచా నూనె, కొద్దిగానీరు కలిపి పేస్టులా చేసి పక్కన ఉంచాలి.


ఛేయు విధానం :        బాండీలో నూనె,నెయ్యి వేసి కాగాక వేరుశనగ గుళ్ళు,పోపుసామాన్లు అన్నీ వేసి ఇంగువ వేసి,దూసిన కరివేపాకు,గాట్లు పెట్టిన పచ్చిమిర్చి,పసుపు వేసి వేగుతుండగా చింతపండు గుజ్జు తీసి పోపులోవేసి కలపాలి.ఉప్పు కూడా వేసి నూనె పైకి తేలేవరకూ కలిపి దించాలి.

ముందుగా వండుకున్న అన్నం పళ్ళెంలో వేసి, ఈ పులి హోర పోపును అందులో బాగా కలిసేటట్లు కలపాలి.కలిపి ఉంచుకున్న ఆవ కూడా అప్పుడే బాగా కలపాలి. ఆవ ఘుమఘుమతో పులిహోర రెడీ!