Wednesday, April 16, 2014

ఆవడలు (దహివడ)

వేసవికాలంలో  ఆవడలు చలవచేస్తాయి. గారెలు తింటే దాహం విపరీతంగా ఉంటుంది. అందుకే నేను ప్రత్యేకంగా ఆవడలు చేస్తాను. చేసే విధానం:-

కావలసిన పదార్ధాలు:-

మినప్పప్పు - 300 గ్రా 

పెరుగు     -1 లీటరు                      

నూనె       -1/2 లీటరు

పోపుకి:- 

మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, చిటికెడు మెంతిగింజలు, రెండు కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర,ఆరు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క.

చేయు విధానం:- 

ఉదయం ఆవడలు చేసుకుంటామనగా, మినప్పప్పు రాత్రి నీళ్ళలో నానబెట్టాలి. పప్పుని శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. సరిపడా ఉప్పు వేసి మరీ గట్టిగా కాకుండా సమంగా గ్రైండ్ చెయ్యాలి. 

పెరుగు కమ్మగా గట్టిగా ఉండాలి పెరుగులో సమంగా ఉప్పు,చిటెకడు పసుపు వేసి కలపాలి. పచ్చిమిర్చి, అల్లం సన్నగాతరిగి, కళాయిలో రెండు చెంచాల నెయ్యి వేసి కాగాక మినప్పప్పు,జీలకర్ర,ఆవాలు,మెంతులు,వెయ్యాలి. చిటపటలాడాక కరివేపాకు,పచ్చిమిర్చి,అల్లం ,కొత్తిమీర అన్నీ నేతిలో వేగి సువాసన వస్తుండగా ఆ తాలింపు పెరుగులో వేసి ఒకసారి గరిటతో కలియతిప్పి పక్కన పెట్టుకోవాలి.

కళాయిలో అరలీటరు నూనె వేసి మరిగాక, అరిటాకుమీద నిమ్మకాయంత మినప్పిండి తీసుకునీఅకుని తడిచేసి గుండ్రంగా చేత్తో వత్తి, మధ్యలో చూపుడువేలితో రంధ్రం చేసి మరిగేనూనెలో వెయ్యాలి. కొంచం దోరగా వేగాక, పక్కన గిన్నెలో చన్నీళ్ళు పెట్టుకోవాలి. వేగిన గారెలను ఈ చన్నీళ్ళలో వేసి తీసి, పెరుగులో వెయ్యాలి.అలా కాకుండా వేడి గారెలు పెరుగులో వేస్తే పెరుగు విరిగిపోతుంది.కాబట్టి ప్రతి గారెను చన్నీళ్ళలో ముంచడం మటుకు మరవకండి.

వెడల్పాటి గిన్నెలో ఆవడలు ఉంచితే గారెలు చితక్కుండా పెరుగులో నానుతాయి. ఆవడలు రుచిగా, మెత్తగా, దూదుల్లా ఉంటాయి. చేసి రుచి చూడండి.....